సొంతింటికి సీఎం కేసీఆర్…అసలు సంగతేంటీ..?

CM KCR Old House Renovation Works

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. .ఒక పని ప్రారంభించాలంటే వంద ఆలోచించి నిర్ణయం తీసుకునే రకం. ఏ నిర్ణయం తీసుకున్నా ముందు చూపు ఎక్కువగా ఉంటుందంటారు అనేకమంది విశ్లేషకులు. అయితే అలాంటి రాజకీయ చతురత కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన ఒక పని ఆయనపై విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు ఉంది అంటున్నారు. తనపై అనవసరపు కామెంట్స్ చేసే అవకాశం ఇవ్వని సీఎం..అందుకు భిన్నంగా ఇప్పుడు చేసిన పనితో ఆయన మాట అనిపించుకోవడం ఖాయం అని కొందరు అంటున్నారు.

ఇంతకీ ఏం జరిగింది…. సీఎం కేసీఆర్ కు జూబ్లీహిల్స్ లోని నందిహిల్స్ లో సొంత ఇల్లు ఉంది. టీఆరెస్ భవన్ కు కొంచెం దగ్గర్లోనే ఈ నివాసం ఉంటుంది. అయితే రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆరెస్ విజయం సాధించడంతో ప్రగతిభవన్ ను నిర్మించి అందులోకి మారారు. ఆ ప్రగతి భవన్ కోసం ఐఎఎస్ అధికారుల భవనాలను కూడా కూల్చేసి భారీ ఎత్తున భవనాన్ని నిర్మించారు. దీనికోసం బాగానే ఖర్చు చేశారు. ప్రగతిభవన్ లో చేరిన తర్వాత నుంచి ఆయన సొంత ఇంటికి వెళ్లలేదు. ప్రగతిభవన్ లోనే పనులు చక్కబెడుతుంటారన్న వాదన కూడా ఉంది.

ఇదిలా ఉంటే అనుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభతో కలిసి సొంతింటికి వెళ్లారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి సొంతింటికి మరమ్మత్తులు చేపిస్తున్నారు. దీంతో సొంత ఇంట్లో జరుగుతున్న పనుల్ని స్వయంగా పరిశీలించిన సీఎం అక్కడ చేసే పనులలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. దాదాపు అర్ధగంట వరకు ఆ ఇంట్లోనే ఉన్న సీఎం…ఇల్లు మొత్తం తిరిగి చూశారట. ఇక ఆయన మనవడు హిమాన్షు కూడా ఉదయం ఈ ఇంటికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లారట. ఒకే రోజు కేసీఆర్, ఆయన మనవడు వేర్వేరు సమయాల్లో ఇంటికి వచ్చి పనులను చూసివెళ్లడం ఆసక్తికరంగా మారింది.

ఇక సొంతింట్లో జరుగుతున్న పనులను ఆయన రాజకీయ ప్రత్యర్థులకు విమర్శలకు అనుకూలంగా మార్చుకుంటారన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుందని అందుకే ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ ముందే సొంత ఇంటిని చక్కబెట్టుకుంటున్నారన్న విమర్శలు వినిపించే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ మధ్యే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి …కేసీఆర్ అడుగు తీసి అడుగు వేసినా దాన్ని విమర్శలకు వాడుకుంటున్నారు. అలాంటిది ఏకంగా సొంతింట్లో జరుగుతున్న పనుల గురించి తెలిస్తే ప్రశ్నించకుండా ఉంటారా…మరోవైపు బండి సంజయ్ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా సొంతింటిని మరమ్మత్తు చేయించుకోవడం తప్పు కాకపోయినా…ప్రత్యర్థులు విమర్శించేందుకు ఛాన్స్ ఇచ్చినట్లవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Spread the love