కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చేసింది….భారీ మూల్యం చెల్లించక తప్పదు…!

COVID 19 Third Wave in Mexico

కోవిడ్ రెండో దశ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనానీకి మరో దెబ్బ తగిలింది. కోవిడ్ శని విరగడ అయ్యిందనుకున్న సమయంలో మరో ఉపద్రవం వచ్చిపడింది. జనాల నిర్లక్ష్యంతో వైరస్ రూపాంతరం చెంది సవాలక్ష కారణాలతో బలపడి విరుచుకుపడేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. జనాలు మాత్రం నిబంధనలు పాటించకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పదనిపిస్తోంది.

తాజాగా మూడో వేవ్ మొదలైంది. కానీ మన భారత్ లో కాదు. మెక్సికో దేశంలో. ఇక్కడ కోవిడ్ మూడో దశ వచ్చేసింది. మెక్సికోలో మూడోదశ కరోనా వ్యాప్తి ప్రారంభమైందని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. వారం రోజులుగా అక్కడ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయట. గతవారం కంటే ఈ వారం 29శాతం అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇక గతేడాది సెకండ్ వేవ్ తో పోల్చిచూసినట్లయితే…ఇది చాలా ఎక్కువగా ఉందని మెక్సికో సర్కార్ ఆందోళన చెందుతోంది. దీని తీవ్రత మరింత భయంకరంగా ఉండొచ్చని…ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది.

ఇప్పటికే మెక్సికోలో మూడో దశ గరిష్టస్థాయికి చేరుకోవచ్చని నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. మూడో దశలో ఎక్కువగా యువతపైనే ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రజల్లో టీకాతో రోగనిరోధకశక్తి పెరిగి మరణాల రేటు మాత్రం తక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
మొత్తానికి మెక్సికోలో మొదలైన మూడో ముప్పు పక్కన ఉన్న అమెరికాకు…ఆ తర్వాత ప్రపంచానికి పాకే ప్రమాదం లేకపోలేదు. అందుకే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. ఇండియాలోనూ ఆగస్టులో మూడో ముప్పు ఉంటుందన్న హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి

Spread the love