ఆంధ్రప్రదేశ్ మహిళలు దేశంలోనే నెంబర్ వన్.

AP Women Got first place in India

మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి…ధైర్యంగా ముందుకు సాగేందుకు స్వయం సహాయక సంఘాలద్వారా ప్రభుత్వం బ్యాంకులతో కలిసి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తోంది. దీంతో మహిళలు, వ్యాపారాలు, కుటీర పరశ్రమలు ఏర్పాటు చేసుకుని స్వయంగా ఉపాధిపొందుతున్నారు. దేశవ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలు పొదుపు చేసేలా ప్రోత్సహిస్తుండటంతో…ఆంధ్రప్రదేశ్ లోని స్వయం సహాయక సంఘాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నాబార్డు రూపొందించిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ మహిళలు సాధించిన ఘనతలు వెల్లడయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్వయం సహాయక సంఘాలు…పొదుపు చేయడంలో దక్షిణాది రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా నిలిచాయి. 2020-21కి వచ్చేసరికి ఏకంగా దేశంలోనే మొదటిప్లేస్ సాధించాయి. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహం వల్లే ఇదంత సాధ్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు పొదుపును పెంచడంలోనే కాదు…అప్పులను తగ్గించుకోవడంలోనూ ముందు ఉన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020-21 లో ఏపీలో మహిళా సంఘాల పొదుపు ఏకంగా 4,153.37 కోట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పొదుపులో 29శాతం. అలాగే అప్పులు కూడా 5,940.97కోట్లు తగ్గాయి. 2019-20లో రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల క్రిడిట్ 69శాతం ఉండగా 2020-21లో 69శాతానికి పెరిగినట్లు నాబార్డు రిపోర్టులో పేర్కొంది.

ఏపీలో పదిలక్షల 58వేల పొదుపు సంఘాలు ఉన్నాయి. అన్నింటికి కలిపి 10,933.04కోట్లు పొదుపు ఉంది. 4,16,621 సంఘాలకు రూ.14,609.84 కోట్లు బ్యాంక్ రుణాల రూపంలో అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే పొదుపు పెరగడంతోపాటు అప్పులు కూడా తగ్గినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విడతలో 87లక్షల మంది మహిళలకు 6,792.21కోట్లు వారి ఖాతాలో వేశారు. సకాలంలో రుణాలు చెల్లించిన గ్రూపులకు సంబంధించి 87లక్షల మందికి పైగా మహిళలకు జీరో వడ్డీ కింద 1,400.8 కోట్లను చెల్లించారు. 2020-21లో జీరో వడ్డీ కింద 1.02 కోట్ల మంది మహిళలకు రూ.1,109 కోట్లను సర్కార్ చెల్లించింది.

Spread the love