మనకు “పీకే” లు అవసరంలేదు-రేవంత్ రెడ్డి..!

Revanth Reddy Comments on PK copy

రాజకీయాల్లో సొంత తెలివితేటలు, బలం ఉంటే వ్యూహకర్తలతో అవసరం ఉండదు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి కూడా ఇలానే ముందుకు వెళ్తున్నాడు. తన శక్తి సామర్ధ్యాలతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఓ వైపు కేసీఆర్ లాంటి రాజకీయ చాణక్యుడు సైతం దేశంలోనే మోస్ట్ పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ప్రయత్నాలు చేస్తూ ఉంటే…రేవంత్ రెడ్డి మాత్రం అసలు ఏ పీకే అవసరంలేదని ఖరాఖండిగా చెప్పేయ్యడం విశేషం.

భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ అభిమానుల మధ్య బుధవారం పీసీపీ చీఫ్ గా గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని ప్రకటించారు.తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి పీకే సేవలను ఉపయోగించుకోవాలని చాలామంది స్నేహితుల నుంచి నాకు సలహాలు వచ్చాయి. అలాంటి వ్యక్తులు మనకు అవసరమా అని కార్యకర్తలను ఉద్దేశించి ప్రశ్నించాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కిషోర్ లాగే శక్తివంతులన్నారు.

మాకు చాలా మంది ప్రశాంత్ కిషోర్ లు ఉన్నప్పుడు నిజంగా మరొక పికే అవసరమా అని ప్రశ్నించాడు రేవంత్. కాంగ్రెస్ కార్యకర్తలే ఏకే47 బుల్లెట్లుగా పనిచేస్తారని అభివర్ణించాడు. టీఆరెస్ ను గద్దెదించడానికి మేం సరిపోతామని బల్లగుద్ది మరీ చెప్పాడు.

ఇక కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ గొప్ప సందేశాన్నిచ్చాడు. రాబోవు రెండు సంవత్సరాలపాటు తమ కుటుంబాలను మరిచిపోయి వచ్చే ఎలక్షన్స్ లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ విజయంపై ధృష్టి పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. ప్రతి కార్యకర్త తన కుటుంబానికి సెలవు ఇవ్వాలనన్నారు. మనం రెండు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే..కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలో వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.

పార్టీకి బలమైన నాయకత్వం ఉంటే అధికారంలోకి రావడం అంత కష్టం కాదన్నారు. మాకు సోనియా రాహుల్ గాంధీ వంటి నాయకులున్నారు…ఆందోళన పడాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మాటలను బట్టి చూస్తుంటే పీకేలాంటి రాజకీయ వ్యూహకర్తల జోలికి వెళ్లకుండా కష్టపడి పనిచేసి అధికారంలోకి రావాలని రేవంత్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఏమేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సిందే.

Spread the love