ట్రంప్ గుణపాఠం..బైడెన్ నేర్పిన పాఠం…

why Modi Fails in COVID 19 Vaccine Drive

సరిగ్గా ఏడాది క్రితం అమెరికాలో ట్రంప్ సర్కారు కరోనా విషయంలో తీసుకున్న అంసబద్ధపు చర్యల వల్ల ఆ దేశం అతలాకుతలం అయ్యింది. బిజినెస్ ఆగిపోతుందని, దేశ ప్రగతి ఆగిపోతుందని, మతిలేని చర్యలతో లాక్ డౌన్ విధించకుండానే, ట్రంప్ సర్కార్ ముందుకు సాగింది. ఫలితంగా అమెరికా గత ఏడాది అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. అంతేకాదు చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రాణనష్టం సంభవించింది. అయితే ట్రంప్ సర్కారు ఏ మాత్రం ముందు చూపు లేకుండా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించింది. కరోనా ఏమి చేయదని, రక్త నాళాల్లోకి ఫినాయిల్ ఎక్కించండి అంటూ వెగటు వ్యాఖ్యలు చేసిన ట్రంప్ కు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. చరిత్రలో పాలకుడు ఎలా ఉండకూడదో ట్రంప్ ఒక గుణపాఠంగా మిగిలిపోయాడు. కానీ కొత్తగా ఏర్పడిన బైడెన్ సర్కారు మాత్రం ఒక ముందుచూపుతో ప్రణాళికతో ముందుకు వచ్చింది. ట్రంప్ సర్కారు చేసిన పొరపాట్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన, వ్యాక్సిన్ ను తన 30 కోట్ల మంది అమెరికన్లకు అందించాలని కృత నిశ్చయంతో ముందుకు సాగింది. అనుకున్నట్లుగానే, బైడెన్ పగ్గాలు చేపట్టిన కేవలం నాలుగు నెలల కాలంలో అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ జోరందుకుంది. వ్యాక్సిన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే దాదాపు 20 కోట్ల డోసుల టీకా పంపిణీ పూర్తైంది. ప్రెసిడెంట్ బైడెన్ నిర్దేశించుకున్న గడువు కంటే వారం రోజుల ముందే లక్ష్యాన్ని సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఈ ఏడాది జనవరి 20న బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి వందరోజుల్లో 10 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే నిర్దేశించుకున్న గడువుకు ముందే అమెరికాలో పది కోట్ల డోసుల టీకా పంపిణీ ప్రక్రియ పూర్తైంది. ఈ క్రమంలో బైడెన్ తన లక్ష్యాన్ని 20 కోట్ల డోసులకు పెంచుకున్నారు. అయితే ఈ లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్న గడువుకు వారం రోజుల ముందే అమెరికా చేరుకుంది. అమెరికాలో దాదాపు నాల్గొవ వంతుపైగా ప్రజలు కొవిడ్ టీకాను తీసుకున్నారు.

మరి భారత్ ముందు నుంచే ప్రపంచానికి మార్గదర్శి అంటూ ఊదరగొట్టేశాం. అంతేకాదు ప్రపంచానికి ఇక్కడి నుంచే వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని, సోషల్ మీడియాలో ప్రచారం కూడా జోరందుకుంది. కానీ ఆచరణలోకి వచ్చే సమాయానికి మన వ్యవస్థలోని లోపాలన్నీ బయటపడ్డాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో ఆధార్ వ్యవస్థ పుణ్యమా అని దేశంలోని పౌరుల సమగ్ర సమాచారం ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ లెక్కన ఆధార్ డేటాబేస్ ఆధారంగా, ఏ వయస్సు వారు ఎంత మంది దేశంలో ఉన్నారో, ఇట్టే తెలిసిపోతుంది. అయినప్పటికీ, ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ మీదున్న శ్రద్ధ వ్యాక్సిన్ తయారీ మీద చూపకపోవడం గమనార్హం. నిజానికి పూనా సీరం ఇనిస్టిట్యూట్ గత ఏడాది నుంచే వ్యాక్సిన్ ట్రయల్స్ ఉత్పత్తిని స్టార్ట్ చేసింది. వ్యాక్సిన్ తుది పరీక్షా ఫలితాలు రాక ముందే, ఆదార్ పూనావాలా ముందస్తు టీకాలను తయారు చేసి ఉంచారు. తుది ఫలితం రాగానే మార్కెట్లోకి వదలాలని తీర్మానించుకొని పెద్ద రిస్క్ తీసుకున్నారు. అటు భారత్ బయోటెక్ కూడా తన కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులను భారీ ఎత్తున తయారు చేసి పెట్టుకుంది. కానీ ప్రభుత్వ సహాయం, సమన్వయం లోబడినట్లు కనిపిస్తోంది. సెకండ్ వేవ్ అంచనా వేయడంలో ప్రభుత్వం ముందస్తు చూపు కొరవడింది. ఇప్పటికే అమెరికాలో మూడొంతుల మందికి వ్యాక్సిన్ దక్కగా, మన దేశంలో మాత్రం కేవలం 1.3 శాతం మందికే వ్యాక్సిన్ దక్కింది. 13 కోట్ల మందికి మొదటి డోసు దక్కగా, సెకండ్ డోస్ విషయంలో మాత్రం కేవలం 1.8 కోట్ల మందికే దక్కింది. సెకండ్ డోస్ కోసం వెళ్లిన వారికి నోస్టాక్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి.

మరోవైపు ఏమాత్రం ముందు చూపు లేకుండా సెకండ్ వేవ్ ముంచుకుస్తున్న వేళ, ఇప్పుడు 18 ఏళ్ల లోపు వారందరికీ, వ్యాక్సిన్ అని ప్రకటించేశారు. అయితే ఇది ఎలా సాధ్యం చేయాలి అనే ప్రణాళిక అటు కేంద్రం వద్ద కానీ, రాష్ట్రాల వద్ద కానీ లేకపోవడం విశేషం. బెంగాల్ ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో సరిచూసుకునే బలమైన యంత్రాంగం, పన్నా ప్రముఖ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న బీజేపీ పార్టీ, ప్రస్తుతం వ్యాక్సిన్ అవసరం ఎంతమందికి ఉంది, ఎంత ఉత్పత్తి చేయాలి. ఎలా ఇంత విశాల జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వాలి అనే విషయంపై స్పష్టత లేకపోవడం గమనార్హం. రాజకీయాలపై ఉన్న శ్రద్ధ, అధికారం నిలుపుకోవడంపై ఉన్న ధ్యాస, ప్రజలకు టీకా అందించడంపై గత సంవత్సరం చివరి నుంచే ఉండి ఉంటే, అమెరికా తరహాలోనే ఈ పాటికి కనీసం 30 శాతం జనాభాకు అయినా వ్యాక్సిన్ అందించి ఉండేవాళ్లం. బైడెన్ నేర్పిన పాఠం, ట్రంప్ మిగిల్చిన గుణపాఠం గమనించాల్సిన బాధ్యత మన పాలకుల అందరిపై ఉంది.

Spread the love