బీజేపీలోకి ఈటెల…మరో రఘురామరాజు అవుతారా…

Etela Rajender about BJP

తెలంగాణాలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వ్యవహారం పూటకు ఒక మలుపు తిరుగుతోంది. నిజానికి సీఎం కేసీఆర్ ఈటెలను ఆచితూచి దెబ్బ కొట్టారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఈటెల పరిస్థితి ఎటు పోవాలో తెలియక అర్ధం కావడం లేదు. ముఖ్యంగా ఈటెల రాజేంద్ర విషయంలో అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరి ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అయితే ఈటెల బిజెపిలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈటల చేరికపై బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇదే విషయమై బీజేపీ జాతీయ నేతలతో బండి సంజయ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో ఈటల రాజేందర్ అంశం గురించి బండి సంజయ్ ప్రస్తావించారు. అయితే బీజేపీలోని అగ్ర నాయకత్వం కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెలను పార్టీలో చేర్చుకోవడం వల్ల, కేంద్రంలోని తమ సర్కారుకు చెడ్డ పేరు వస్తుందా అనే దిశగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భూ ఆక్రమణల కేసు పురోగతిని బట్టి, అందులో ఈటెల గురించి పూర్తి వ్యవహారం, బయటపడితే కానీ కాషాయ కండువా కప్పే విషయంలో..తొందర పడొద్దు అని బీజేపీలోని తెలంగాణ సీనియర్ నేత ఒకరు అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది. ఈటెల వేయబోయే ప్రతీ అడుగు కేసీఆర్ ముందే ఊహించారని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఈటెల బీజేపీలోకే వెళ్తారనే విషయం గుర్తించలేనంత అమాయకుడు కేసీఆర్ కాదని, ఆయన ఈ రిస్క్ తీసుకోవడం వెనుక ఏదో మతలబు ఉండే ఉంటుందని, తొందరపడి కేసీఆర్ మాయాజాలంలో పడితే మాత్రం, మొదటికే మోసం వస్తుందని అధిష్టానానికి చెప్పుకొచ్చారు.

మరోవైపు ఈటెలను వెంటనే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళితే, ఫలితం కాస్త అటు ఇటూ అయినా, ఆ ప్రభావం 2023 ఎన్నికలపై పడుతుందని కూడా అధిష్టానం ఆలోచిస్తోంది. అందుకే ఈటెలను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ఇవ్వకుండా సలహా ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు 2023 వరకూ వేచి ఉండి, ఏపీలో రఘురామ కృష్ణంరాజు తరహాలో ఈటెలను కూడా కేవలం కేసీఆర్ పై విమర్శలు చేసే టీఆర్ఎస్ అసంతృప్త నేతగానే కొనసాగేలా చేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది.
మరోవైపు టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలను చేర్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులును బీజేపీలో వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. బీజేపీ హైకమాండ్ సమయం ఇస్తే కాషాయ కండువా కప్పే అవకాశం ఉంది. అయితే ఈటెల త్వరలోనే రేవంత్ రెడ్డిని కూడా కలిసే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది.

Spread the love