ఆపరేషన్ హుజురాబాద్…రంగంలోకి హరీశ్ రావు

Harish Rao politics in Huzurabad

తెలంగాణలో రాజకీయం రాజుకుంది. ఈటెలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ చకచకా పావులు కదుపుతున్నారు. ఇఫ్పటికే ఈటెల రాజేందర్ ను ఆయన సొంత నియోజకవర్గంలోనే దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీష్ రావు తాజాగా రంగంలోకి దిగారు. గతంలో ఈటెలతో అత్యంత సన్నిహితంగా ఉన్న హరీష్ రావు ఇప్పుడు తన సహచర ప్రజాప్రతినిధి అయిన ఈటెలకు షాక్ ఇఛ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈటల సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లోనే హరీష్ పాగా వేశారు. అక్కడే ఉండి టీఆర్ఎస్ పార్టీ కేడర్ ను ఈటెల వెంట వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈటెల అనుచరులతోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని.. టీఆర్ఎస్ కేడర్ అంతా పార్టీతోనే ఉందనే, ఫీలింగ్ కలిగేలా చేస్తున్నారు. తాజాగా హూజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులతో హరీష్ భేటీ అయ్యారు. వారితో ఈటెల వెంట వెళ్లకుండా చక్రం తిప్పారు.

మంత్రి హరీష్ రావుతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా కమలాపూర్ మండల నాయకులతో భేటీ కావడం విశేషం. టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని హుజూరాబాద్ నేతలు పనిచేసేలా వారందరినీ ఒఫ్పించారు. ఇఫ్పటికే కమలాపూర్ నేతలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నామని చెప్పుకొచ్చారు. వారంతా ఈటలతో లేమని.. ఈ విషయంలో టీఆర్ఎస్ తోనే ఉన్నామని కమలాపూర్ నేతలు స్పష్టం చేశారు. ముఖ్యంగా కింది స్థాయి నేతల్లో ఆశావహులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వచ్చేలా చూస్తామని మంత్రి హరీష్ ఈసందర్భంగా హామీ ఇచ్చారు. అంతేకాదు హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉందని అనవసరంగా గందరగోళానికి గురై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు.

ఇదిలా ఉంటే హుజూరాబాద్ లో ఈటల సొంత మండలం నాయకులను టీఆర్ఎస్ వైపే నిలిపి ఉంచడంలో హరీష్ చక్రం తిప్పారు. ఇదిలా ఉంటే హరీష్ ఎంట్రీతోనే అక్కడి ఈటల మద్దతుదారులు స్తబ్దుగా మారారని, ఇంకా రెండు సంవత్సరాలకు పైగా అధికారం చేతిలో ఉంచుకొని అనవసరంగా ప్రతిపక్షంగా మారితే మొదటికే మోసం వస్తుందని హరీష్ వారిని సముదాయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒకప్పుడు సన్నిహితులైన ఈటల హరీష్ లు ఇప్పుడు ఇలా వైరి వర్గాలకు చేరడం చూసి నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Spread the love