దటీజ్ కేసీఆర్…కొంప ముంచిన కమలం అతి ఉత్సాహం…

KCR Shock to BJP

ఒలింపిక్స్ లో పాలిటిక్స్ ను క్రీడల విభాగంలో ప్రవేశ పెడితే అందులో కేసీఆర్ కు తప్పకుండా గోల్డ్ మెడల్ దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతిపక్షాలు బలం పుంజుకోవడం, అటు మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక బ్రిగేడ్ ఏర్పడటం, అలాగే జీహెచ్ఎంసీలో ఓటమి వెరసి అన్ని దిక్కుల నుంచి పోట్లు మొదలైనప్పటికీ, కేసీఆర్ తన రాజకీయ చాణక్యంతో ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజక వర్గాల్లో విజయం సాధించిన అందరిన నోళ్లు మూయించారు. అసలు కేసీఆర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా ప్రచారానికి వస్తారని అంతా భావించారు. అంతేకాదు పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ కాకుండా కేసీఆర్ ఇకపై ప్రగతి భవన్ వీడి ప్రజల్లోకి వస్తారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా కేసీఆర్ తన రాజకీయ చాణక్యంతో బుర్రకు పదును పెట్టి తాను కూర్చున్న చోటి నుంచే అన్ని ఎత్తులు వేశారు. కేసీఆర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో రాజకీయ నేత అయి ఉంటే నిలువునా కూరుకుపోయేవారు. లేదా టెన్షన్ తో తప్పుడు నిర్ణయాలు తీసుకునే వారు. అటు ఏపీలో కేసీఆర్ కన్నా సీనియర్ రాజకీయ నాయకుడు అయిన చంద్రబాబు ఎత్తులు చిత్తవుతున్నాయి. 15 సంవత్సరాల సీఎం అనుభవంతో ఆయన ప్రజల్లోకి వెళ్లినప్పటికీ, ఓట్లు రాలలేదు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఇంట్లోంచి బయటకు రాకుండానే ఓట్లు సాధించారు.
నిజానికి వరంగల్ , నల్లగొండ, ఖమ్మం స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయంపై పెద్దగా ఎవరూ నమ్మకం పెట్టుకోలేదు. కానీ కేసీఆర్ వ్యూహంతో ఆయన విజయం అనూహ్యంగా దక్కింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనుకున్న ఫలితాలు రాబట్టకపోవడంతో ఇక ఈ సీటు కచ్చితంగా బీజేపీ పరం అవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా నామినేషన్లు ముగియడానికి రెండు రోజుల ముందు కేసీఆర్ తన పాచిక విసిరారు. పీవీ కుమార్తె సురభి వాణిదేవిని అభ్యర్థిగా నిలబెట్టడంతో బీజేపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పట్టభద్ర ఓటర్లు బ్రాహ్మణసామాజికవర్గం వారే ఉన్నారు. అటు బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కూడా అదే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడక అవుతుందని అంతా భావించారు.

కానీ కేసీఆర్ విసిరిన పాచిక ముందు బీజేపీ నేతలు సోయిలోకి వచ్చే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్రాహ్మణ సామాజికవర్గంలో ఇప్పటికే పీవీ పట్ల సానుభూతి గౌరవం ఉన్నాయి. ప్రధాని స్థాయిలో పని చేసిన వ్యక్తి కుమార్తెకు ఓటు వేయకుండా బ్రాహ్మణ సామాజికవర్గం ఉండలేక పోయింది. అత్యుత్సాహంతో తమకు విజయం నల్లేరు పై నడక అవుతుందని భావించిన బీజేపీకి కేసీఆర్ వేసిన ఎత్తులతో చివర్లో చెమటలు పట్టాయి. పీవీ కుమార్తెను నిలబెట్టడంతో బ్రాహ్మణ ఓట్లన్నీ టీఆర్ఎస్ వైపే పడ్డాయని సమాచారం బయటకు వస్తోంది. అయితే కేసీఆర్ రాజకీయ వ్యూహాల ముందు సరి తూగడం అంత సులభం కాదని, ఇటీవలే ఆ పార్టీలో చేరిన కేసీఆర్ సన్నిహితులు బహిరంగంగానే బండి సంజయ్ ముందు వాపోయారట.

Spread the love