కోవిడ్ వేళ.. గుర్తుకొస్తున్న రాజన్న మాటలు..

YSR Words During Covid Crisis

2009 ఎన్నికల్లో గేమ్ చేంజర్ ఏదైనా ఉందంటే అది కర్నూలులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనే చెప్పాలి. ఆనాడు మహాకూటమిలో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు జతకట్టగా, కాంగ్రెస్ ఒంటరి పోరుకు దిగింది. అయితే ఆనాడు వైఎస్ఆర్ తెలంగాణలో మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగానే, రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా, మహాకూటమి అధికారంలోకి వస్తే హైదరాబాద్ కు వీసా తీసుకొని వెళ్లాలి అని కర్నూలులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంతేకాదు కోస్తాంధ్రలో టీడీపీ ఓట్లకు గండి పడేందుకు ఈ వ్యాఖ్యలు దోహదం చేశాయి. ఫలితంగా వైఎస్ఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. అయితే ప్రస్తుతం సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత వైఎస్ వ్యాఖ్యలు నిజం అవుతున్నాయని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే కోవిడ్ విషాదంతో ఎంతో మంది ఏపీకి చెందిన రోగులు, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తుంటే వారిని రాష్ట్ర సరిహద్దుల్లో నిలిపివేయడం చాలా హేయమని, అమానవీయమైన చర్య అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. స్వతంత్ర భారతావనిలో ఏ రాష్ట్ర ప్రజలైనా, దేశంలో ఏ మూల ఉన్నా..వైద్యం పొందడం ప్రాథమిక హక్కు. ఆ హక్కును కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం నిజంగానే ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ప్రాణంకన్నా విలువైనది ఈ ప్రపంచంలో ఏది లేదు. ఆస్తి నష్టం కన్నా, ప్రాణ నష్టమే విలువైనదని సామాజిక విలువల్లో మొదటి సూత్రం. అలాంటి సామాజిక విలువలను మరవడం బాధాకరం.
అయితే రాష్ట్ర విభజన భౌతికంగా తెలుగు ప్రజలను విడగొట్టింది కానీ, మానసికంగా కాదని ఇంతకాలం నమ్మారు. కానీ కోవిడ్ కారణంగా, తెలుగు ప్రజలు మరింత దూరం అయ్యేలా చేసిందనే విమర్శలు వస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఇంకా పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని, ఆ సంగతి విభజన చట్టంలో కూడా పేర్కొని ఉంది. అయినప్పటికీ, ఇక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్రంలో చికిత్స పొందండం రాజ్యాంగ హక్కు, ఈ విషయంలో హైకోర్టు సైతం తెలంగాణ ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టడం గమనార్హం. కోవిడ్ బాధితులతో పాటు, ఇతర వ్యాధిగ్రస్తులు కూడా వందల సంఖ్యలో హైదరాబాద్ వస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో రాజకీయాలు చేయడం తగదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా ఇరు ప్రభుత్వాలు కలిసి మాట్లాడుకొని ఈ పరిస్తితిని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావాలని రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు..

Spread the love