ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లకు జైలు శిక్ష

High court on IAS Officers

ఏపీప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈ సారి ఏకంగా ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్‍, అలాగే ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి వారం రోజులు జైలు శిక్ష విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు అమలు చేయకపోవటం పై వీరిద్దరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్వాపరాల్లోకి వెళితే ఉద్యావన శాఖకు చెందిన, విలేజ్ హార్టికల్చ్ర్ అసిస్టెంట్ పేరిట కొన్ని పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు కు సంబంధించి 36 మందిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, వారు గతంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అయితే దీనిపై హైకోర్టు తీర్పు ఇస్తూ, వీరిని రెగ్యులరైజ్ అయినా చేయాలని, లేదా సెలక్షన్ ప్రాసెస్ లో వీళ్ళకు ప్రాధాన్యత కల్పించాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాలు అమలు కాలేదు. దీంతో బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుని విచారణకు తీసుకున్న హైకోర్టు కోర్టు ధిక్కరణ నేరంగా దీన్ని పరిగణించింది. తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఇద్దరు అధికారులను కోర్టు ఆదేశించింది.

అయితే గత వాయిదాలో చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‍లను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వారు హాజరు కాగా తాము ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏం ఉత్తర్వులు ఇచ్చారని న్యాయస్థానం వారిని ప్రశ్నించింది. అయితే ఉత్తర్వులు ఏమి ఇవ్వలేదని చెప్పటంతో, న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు కోర్టు దిక్కరణ కింద, అధికారులు ఇద్దరికీ వారం రోజులు జైలు శిక్ష విధించింది. కాగా అధికారులకు శిక్ష ఖరారు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రభుత్వ ప్లీడర్, జైలుకు పంపవద్దని, శిక్ష విధించవద్దని, తీర్పుని రెండు రోజులు వరకు వాయిదా వేయాలని హైకోర్టుని అభ్యర్దించారు. కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Spread the love