రంగస్థల నటుడు జయ ప్రకాష్ కన్నుమూత

Jaya Prakash

తెలుగు చిత్ర సీమలో రంగస్థల నటన ద్వారా సినిమాల్లో ప్రవేశించి మెప్పించిన అతి కొద్ది మంది నటులలో జయ ప్రకాష్ రెడ్డి ఒకరు. విభిన్న యాసలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన నటన తెలుగు జాతి ప్రజలు అందరికీ సుపరిచితమే. ప్రేమించుకుందాం రా, సమరసింహా రెడ్డి, జయం మనదేరా, చెన్న కేశవ రెడ్డి వంటి పలు యాక్షన్ చిత్రాల్లో ప్రతి నాయకుడిగా, కిక్, ఎవడి గోల వాడిది, ఢీ వంటి సినిమాల్లో మంచి కమేడియన్ గా అలరించినా అది ఆయనకే చెల్లింది. రాయలసీమ భాష లో ప్రేక్షకుల మన్ననలు చూరగొన్నా, నెల్లూర్ భాషలో మంచి రసవత్తరమైన కామిడీ ని పండించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. అటువంటి వ్యక్తి ఆకస్మిక మరణం అందరినీ కలిచివేసింది. గుంటూర్ లోని ఆయన స్వగృహంలో ఉదయం బాత్ రూమ్ కి వెళ్ళిన ఆయన ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆయన చనిపోయారు.

 

జయ ప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయనకు చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో ఉన్నపుడు కూడా ఆయన పలు నాటకాల్లో ఆయన ప్రదర్శనలు చేశారు. జయప్రకాష్ రెడ్డి నల్గొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు. 1997 లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రం ప్రతినాయకునిగా జయ ప్రకాష్ కు మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు చిత్ర సీమలో అగ్ర కథానాయకులకు ప్రతి నాయకునిగా ఆయన ఎన్నో చిత్రాల్లో కనిపించారు. ఈ తరం నాయకులతో కూడా ఆయన తెరను పంచుకున్నారు. చిత్ర సీమలో ఎంత ఎత్తుకి ఎదిగినా ఆయనకు నాటకాలంటే ఎనలేని మక్కువ. ఆయన గుంటూర్ లో జరిగే రంగస్థల కార్యక్రమాలకు క్రమం తప్పకుండా ఇప్పటికీ హాజరు అవుతారు.

 

Spread the love