పులులని సైతం అదుపు చేసిన రేవంత్ రెడ్డి.. ఎలా..?

Congress Leaders Silent after Revanth reddy become PCC Chief

అనూహ్యం.. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించినా ఏమంత వ్యతిరేకత రాలేదు. ఇది అద్భుతం అనే చెప్పాలి. రేవంత్‌ను గనక పీసీసీ చీఫ్‌గా చేస్తే పార్టీ ముక్కలవుతుంది అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరికి వారైపోతారని భావించారు. చాలా మంది టీఆర్ఎస్ లేదా బీజేపీ గూటికి వెళ్తారని అంచనా వేశారు. కాని, అలాంటిదేం జరగలేదు. ఊహించుకుని భయపడినంత రాద్ధాంతం అయితే జరగలేదు. మరి ఏం జరిగింది? ఈ మాయ రేవంత్ చేశాడనే అనుకోవాలా?

రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించొచ్చన్న వార్త వెలువడిన ప్రతీసారి ఏదో ఒక అడ్డంకి. సీనియర్ల వ్యాఖ్యలతో అధిష్టానం వెనకడుగు వేస్తూ వచ్చింది. నిజానికి నాగార్జున సాగర్ ఉపఎన్నికప్పుడే నిర్ణయం రావాల్సింది. కాని, రేవంత్‌ను నియమిస్తే అగ్గి రగిల్చినట్టేనని, ఎన్నికల్లో బోల్తాపడతామని, నిర్ణయాన్ని వాయిదా వేయమని కొందరు నేతలు అధిష్టానాన్ని కోరారు. అంటే, రేవంత్ పీసీసీ చీఫ్ కాకుండా ఉండేందుకు ఏ లెవెల్‌లో పనిచేశారో అర్ధం చేసుకోవచ్చు. తీరా చూస్తే అంత అసంతృప్తి సెగలేం కనిపించడం లేదు. పోనీ, పైకి మాట్లాడకపోవచ్చు.. కాంగ్రెస్‌లో ఉండడం ఇష్టం లేని వారు వేరే పార్టీలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నించొచ్చుగా. కాని, అలాంటిది కూడా జరగడం లేదు.

కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తామన్నా.. కళ్లకు అద్దుకుని తీసుకుంటారు అధికార పార్టీ నేతలు. అందులో అందరికీ డోర్లు బార్లా తీసి ఉంటాయి. ఇక బీజేపీ గురించి కూడా చెప్పక్కర్లేదు. 20 ఏళ్ల పాటు కేసీఆర్‌తో తిరిగిన వ్యక్తిని ఠక్కున తీసుకున్నారు. అలాంటిది కాంగ్రెస్ నుంచి వస్తానంటే వద్దంటారా? అంటే, అసంతృప్త కాంగ్రెస్ పార్టీ నేతలకు అవకాశాలు, ఆఫర్లు ఉన్నాయనేగా అర్ధం. అయినా సరే.. ఇప్పటి వరకు ఒక్కరు కూడా పార్టీని దాటి వెళ్లలేదు. మహా అయితే రాజీనామా చేశారంతే. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించిన వెంటనే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న మర్రి శశిధర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. కాని, వీళ్లెవరూ మరో పార్టీలోకి వెళ్లలేదు. ఏకంగా అధిష్టానంపైనే ఎదురుతిరిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రెండో రోజుకే సైలెంట్ అయ్యారు.

నిజానికి కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తామంటే.. ఎదురు కట్నం ఇచ్చి మరీ తీసుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే అది దక్షిణ తెలంగాణలోనే. అందులోనూ నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది. టీఆర్ఎస్ హవా ఉత్తర తెలంగాణలో బాగా ఎక్కువ. కాని, దక్షిణ తెలంగాణకు వస్తే కాంగ్రెస్ బలం ఎక్కువ. ఈ లెక్కన దక్షిణ తెలంగాణలో పాగా వేయాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మంచి ఆప్షన్. కాని, ఇప్పటి వరకు అలాంటి సంకేతాలు కూడా రాలేదు. మరీ ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ అయితే.. తాను బీజేపీలోకి వెళ్తానంటూ ఎప్పుడో సిగ్నల్ ఇచ్చారు. ఆ లెక్కన అన్నయ్యకు పీసీసీ ఛీఫ్ పదవి రాని మరుక్షణమే జంప్ అయి ఉండాలి. కాని, అలా జరగలేదు. అన్నకి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది అని మాత్రమే స్టేట్‌మెంట్ ఇచ్చారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అధిష్టానం ఆదేశించింది.. అందరం పాటించాల్సిందే అని కామెంట్ చేసి ఊరుకున్నారు. భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి.. పీసీసీ కమిటీలో తన వారికి చోటు ఎందుకు ఇవ్వలేదు అని మాత్రమే ప్రశ్నించారు తప్ప.. రేవంత్‌ను ఎందుకు పీసీసీ చీఫ్‌ను చేశారని ప్రశ్నించలేదు. ఇక ఈ రేసులో పోటీలో ఉన్న జీవన్ రెడ్డి అయితే.. ఇప్పటి వరకు కామెంట్ కూడా చేయలేదు. సో, మొత్తానికి అసమ్మతి, అసంతృప్తి మొత్తం దుప్పటికప్పుకుని పడుకుందనే అర్థం. మళ్లీ ఎవరో వచ్చి నిద్ర లేపితే తప్ప.. ఈ రెండూ బయటకు రాకపోవచ్చు.

Spread the love